About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday 13 October 2012

కదా ....?????

నువ్వంతా తెలుసునని  నేననుకుంటాను 
నేనంతా తెలుసునని నువ్వనుకుంటావు 
ఇరు స్వప్న తీరాల వెంబడి మనం 
ఒకరికొకరం ఎప్పటికీ అపరిచితులమే




Thursday 11 October 2012

రవీంద్ర కథావళి



ఎప్పుడో అనేక ఏళ్ళ క్రితం చదివాను రవీంద్రుడి కథలు ఆంగ్లంలో .కాబూలి వాల  ఎక్కడో పాఠం గా వుండటం ,అప్పటి ఆ పాటానికి బొమ్మ మనసులో ఇప్పుడు కూడా వుంది ఈవాల్టి లాగా నూతనంగా .హెచ్ సి యు లైబ్రరీలో గోరా చదివినపుడు కన్నూ మిన్నూ తెలియని అతని అభిజాత్యం ,ఆ పైన ముగింపు ...గౌర వర్ణపు గోరా రూపం మది చిత్రించుకున్న మరో జ్ఞాపకం .

మొన్నప్పుడు డిల్లీ  నుంచి రవీంద్ర కథావళి ని తెచ్చుకున్నానా .మేఘ సంద్రాన్ని దాటుకుంటూ ఊరికే ఒక్క కథ అనుకున్నానా ...అరె బోల్డు పనులున్నాయన్నా  రవీంద్రుడు వదలందే!

బెంగాల్ కి వచ్చాక రవీంద్రుని పట్ల బెంగాలుల పిచ్చి భక్తి ,శరతుని అసలకసలె పట్టించుకోకపోవడం చాలా బాధించేది .శరతు  పేదవాడనే కదా ,రవీంద్రుడు జమీన్దార్ అనే కదా ఆ వివక్ష అని కినుకుగా వుండేది .ఆ కినుకు శరత్ చంద్రుని   జీవిత చరిత్ర చదివాక   రవీంద్రుని పై   మరీ పెరిగింది .ఏవిటో ఒకలాటి ధిక్కారమూ ,అయిష్టమూ ...

ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు  ఈ కథలు చదివాక మనసు ఒక్క సారి  సరళమై పోయింది  .అసలకి ఇతనేంటి? స్త్రీలనీ పురుషులనీ , పిల్లలనీ ,వృద్దులనీ ,పేదలనీ, ధనికులనీ బేధ భావం లేకుండా యెట్లా అన్ని హృదయాలలోకి రాచ బాట వేసుకుని పయనించ గలుగుతున్నాడు ?ఎక్కడిది  ఇతనికీశక్తీ  అని...ఒకటే ఆశ్చర్యం .బహుసా అందుకనే  వీళ్ళందరూ గొప్ప రచయితలయ్యారేమో  .గొప్ప రచయితలంటే సర్వాంతర్యామి అయిన భగవంతుడని ఏమో !లేకుంటే ఇదంతా యెట్లా సాధ్యం ?

 ''మాష్టారు గారు '' కథలో హరలాల్ ,''రాస మణి  కొడుకు'' కథలో కాళీ పద్  పొద్దుటి నుండీ ఎంత బాధ పెడుతున్నారో.మరో మార్గమేమీ లేకుండా వాళ్ళిద్దరూ పేదరికానికి బలికావడం ఎంత బాధిస్తుందో .ప్చ్ పెద్దవాల్లమయ్యాక భోరుమని ఏడ్చే స్వాతంత్ర్యాన్ని మనమే పోగొట్టుకుని దిగులునంత గుండెకి చేర్చేసుకుంటాం .అప్పుడు కదా గుండె భరువెక్కడమనే   మాటకి  యదాతదంగా  అర్థం బోధ పడేది.

''పోస్ట్ మాస్టర్'' కథలో రతన్ ,''సమాప్తి ''లో తనకు తెలియకనే బాల్యం నుండి యవ్వనం లోకి సాగిన  చిన్ని మ్రున్మయి ,ఎప్పుడు ఎందుకు  అట్లా జరిగిందో తెలియక దుక్కాన్ని గుప్తంగా గుండెల్లో దాచ ప్రయత్నించి ఓడిన చారులత ...అసలు చారు లేదా ,,స్త్రీ బాధ అంత విశదంగా ,చూసినట్లు మరీ రవీంద్రునికి యెట్లా తెలిసిందని ఆశ్చర్యం .

''భార్య రాసిన లేఖ''లో రవీంద్రుడు భార్యగా ఒక స్త్రీ ఐ  ,చీరకి నిప్పంటించుకుని  చనిపోయిన తన అనాధ బాంధవి  గురించి ''ఊళ్ళో వాళ్ళందరూ రేగారు.'ఆడవాళ్ళు చీరెలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్ అయిపొయింది 'అన్నారు .
ఇదంతా నాటకం అన్నారు మీరు .కావచ్చు .కానీ ఈ నాటక క్రీడ -కేవలం బెంగాలీ స్త్రీల చీరెల మీదుగానే జరుగుతున్దెం ?బెంగాలీ వీర పురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకనీ  ?అది కూడా ఆలోచించి చూడటం యుక్తం ...!అని 1913 లోనే  స్త్రీల తరపున  నిర్ద్వందపు వకాల్తా పుచ్చుకున్నాడు కదా  అందుకని ఇప్పుడిహ  మూర్ఖ భక్తునికి భగవంతుని యందు ఎంత భక్తి వుంటుందో రవీంద్రునికి  అంతటి భక్తురాలనై పోయాను. అచ్చు బెంగాలుల లాగా !

ఎంతెంతో రాయాలని వుంది కానీ ఏమిటో కథా చర్చ కంటే యుక్తా యుక్త జ్ఞానాన్ని కోల్పోయి మరీ ... కన్నీటితో రవీంద్రుని పాదాలని అభిషేకించాలి వంటి డైలాగ్ లు  నిస్సిగ్గుగా ,అదుపు తప్పి వస్తున్నాయ్ . అందుకని ఇక్కడకి ముగించడం యుక్తమని ముగిస్తున్నా .

తప్పక చదవాల్సిన పుస్తకం ''రవీంద్ర కథావళి'' .ఈ గొప్ప అనువాదం మద్దిపట్ల సూరి గారిది .