About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday 18 May 2013

ఇందుమూలంగా సెలవు ప్రకటించడమైనది !



...ఎందు  మూలంగా అంటారా ,,బోల్డు  చదవాల్సినది వుంది . ఈ బ్లాగ్ ఒక అడ్డంకి కాదనుకోండి ,  చదవాల్సిన పని కాక రాసే పని ఒకటీ , పని చేయాల్సిన ఇంకో ప్రాజెక్టూ వున్నాయి ముందర . నాకేమో బ్లాగ్ వ్యసనం కదా . టైం  లేకున్నా రాద్దామనిపిస్తుంది. అందుకని రెండు  నెలలు ..వూ ... పోనీ నెలన్నర చుట్టీ పెట్టేద్దామని అనుకుంటున్నా .వుత్తుత్తి చుట్టీ నా మనసులో నేనే అనుకున్నాననుకోండి సరేలే  అనుకుని రాసేయ్యగలను . అందుకని స్మోకర్స్ బహిరంగ ప్రకటన చేసినట్లు ఇలా ప్రకటన చేసి బ్లాగ్ ని సుప్తావస్తలో పెట్టేసేయ్యదలచుకున్నా .

అసలు ఇంత చెప్పాల్సిన అవసరం ఏంటంటే ... నాకూ పాటకులున్నారు కదా ,మరి వారికి బాధ్యత పడి  వున్నాను కదా అందుకని . నా పాటకులు నాకు పర్మిషన్ గ్రాన్టేడ్ అనేసారని భావిస్తూ  రేపే బ్లాగ్ మూతపెడుతున్నా .


Friday 17 May 2013

ఎంత ఆనందమో ... హృదయం నిండి పోయింది



ఎంత ప్రేమగా చెప్పనూ ఈ పాట  గురించీ ?వింటూ వుంటే హృదయం నిండి పోతుంది .ఆనందం ఎక్కువైతే హృదయం భరించ కలదా ?ఏడుస్తుంది . పై పైకో...  లోపల లోపలో . టాగోర్ '' రబీంద్ర  సంగీత్ '' నుండి ఇది కూడా .రాసిన వారికి ,పాడిన వారికి పాద ప్రణామాలు .

పాడింది కనికబెనర్జీ https://en.wikipedia.org/wiki/Kanika_Banerjee. మొన్నో రోజు పాపాయి వాళ్ళ నాన ఇంట్లోకి తెచ్చాడు ఈ పాటని . రోజంతా దీనితోనే గడుస్తుంది అయినా తనివి తీరదు . ఒక్కో సారి నా కాశీ చెంబులో పోసుకుని తాగేద్దామని అనిపిస్తుంది .పాట వింటూ వుంటే  చాలా కోపం తెప్పించిన వాళ్ళని కూడా ,వెళ్ళండి ,ఇక తప్పులు చేయకండి ,సామాన్య మిమ్మల్ని క్షమించి  వేసింది అని దయగా దగ్గర కూర్చో  పెటుకుని చెప్పాలనిపించింది . హృదయం సరళమై ,దయార్ద్ర మయింది .

ఈ పాట లో ఆనందం వుంది . ప్రేమ వుంది .

తెలుసా ... రవీంద్రుడు ఎన్ని గీతాలు రాసాడో?మూడు వేల ఐదువందలు . ఆ మాట వింటే ఎంత ఆనందం వేసిందో .ఇకనేం రోజుకో కొత్త పాట విన వచ్చని . సంగీతం జీవితాన్ని సఫలం చేస్తుంది . కానీ ఒక్కోసారి ఎంత బాధ వేస్తుందో నాకెందుకు పాడటం  రాదని . బెంగాలీలు ఈ విషయం లో దయగల వారు . నాకు రబీంద్ర సంగీత్ నేర్పించే మా టీచరు అంటుందీ హృదయం లో ఇంత ఇష్టం వుందే మీకు ,పాడటం రాక పోవటమేమిటి ?నేను తయారు చేస్తా కదా మిమ్మల్నీ అని .

Anandadhara Bohichhe Bhubone 
Anandadhara Bohichhe Bhubone 2
Dino rojoni koto Amrito Roso
Utholi jai Ananto Gogone 
Anandadhara Bohichhe Bhubone 2 
Pano(?) Kore Robi shashi Anjali Bhoriya 
Soda dipto rohe Akhhoyo Jyoti 2 
Nittya purno Dhora Jibone Kirone
Anandadhara Bohichhe Bhubone 2
Bosiya Accho Keno Apon Mone
Shartha Nimogono Ki Karone. 
Chari dike dekho Chahi Hridoyo Prosari 
Khudro Dukkho Sobo tuchho mani 2 
Prem Bhoria Loho Sunno Jibone
Anandadhara Bohichhe Bhubone 2

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇది పాడింది బహుశా  ఇంద్రాణి సేన్ .
All over the world flows the stream of joy.
Night and Day, in the sky, much nectars deploy.
The stars drink the glow with folded palms.
The eternal light, always stay bright and calm.
The globe is continually full of life and ray.
Why are you sitting detached?
Why are you so self-centered?
Open your heart and look all over.
Ignore the small pains as minor.
Fill the empty life with love and care.
All over the earth flows a flood of joy

Thursday 9 May 2013

పచీసే బైశాక్


పచీసే బైశాక్ అంటే వైశాఖ మాసపు 25 వ తారీకు అని . ఈ రోజు బెంగాలీలకు అతి ఇష్టమైన రోజు . ప్రభుత్వ సెలవు  దినం .ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే రవీంద్ర నాథ్ టాకూర్ పుట్టారు . బెంగాలీల హృదయాధి దేవుడు కావడమే కాక భారత సాహిత్య సీమని సుసంపన్నం చేసారు టాకూర్. పొద్దుటే రాలీ కి వెళ్లి వచ్చి పాపాయి వాళ్ళ నాన ఆశ్చర్య పడ్డాడు ,ఒక వేళ  రవీంద్రుడు పుట్టక పోయి వుంటే బెంగాలీలు ఏమై  పోదురోనని .బెంగాలీలకి రవీంద్రుని పై వుండే పిచ్చి అభిమానం మనకు ఇటువంటి ఆలోచనలను కలిగిస్తే ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు .

ఈ సందర్భం లోనాకు బాగా ఇష్టమైన రబీంద్ర సంగీత్ నుండి ఒకగీత్http://en.wikipedia.org/wiki/Ekla_Chalo_Re
  .  ఈ పాటని నేను ఏడేళ్ళ క్రితం మొదటి సారి కూచ్ బిహార్ ''సాగర్ దిఘి ''ఒడ్డున ఓ సాంధ్య వేళ విన్నాను .  ''ఎక్లచలో ''అంటే ఏమిటీ అని అడిగాను . ఒక్కడీవే \ఒక్కతివే వెళ్ళు అని అర్థం తెలుసుకున్నాక ఈ పాట  మొత్తం అర్థం తెలుసుకోవాలనిపించింది . ఈ గీతం అధైర్యం లో ధైర్యాన్ని ఇస్తుంది .కొత్తని ఒప్పుకోని ప్రపంచానికి , దిగులు పడకుండా,కుంగి పోకుండా మార్గ నిర్దేశం చేసే శక్తినీ ఇస్తుంది . ఈ పాట  రాసినందుకు రవీంద్రుడికి మనం తర తరాలుగా రుణ గ్రస్తులమయ్యాం .  

(Jodi tor daak shune keu naa se tobe ekla cholo re
Tobe ekla cholo, ekla cholo, ekla cholo, ekla cholo re)2

Jodi keu kothaa naa koye, ore ore o abhaagaa, keu kothaa na koye
(Jodi shobai thaake mukh phiraaye shobai kore bhoye)2
Tobe poraan khule (o tui mukh phute tor moner kothaa, eklaa bolo re)2

Jodi shobai phire jaaye, ore ore o abhaagaa, shobai phire jaaye
(Jodi gohan pothe jaabaar kaale keu phir naa chaaye)2
Tobe pothera kaantaa (o tui rokto maakhaa choronatole eklaa dolo re)2

Jodi aalo naa dhore, ore ore o abhaagaa, aalo na dhore
(Jodi jhor-baadole aadhaara raate duyaar deye ghore)2
Tobe bajraanole (aapon buker paajor jaaliye niye ekalaa jolo re)

ఈపాటంటే గాంధీజీ కి చాలా ఇష్టమట . మనసు దిగులు పడినపుడు ,నిరాశ కమ్ముకున్నపుడు ఈ పాట వినే వాడట . 

ఒక  వేళ ,నీ పిలుపునందుకుని  ఒక్కరు కూడా  రాకుంటే 
నిన్ను ఏకాకిని చేసేస్తే ,మరేం పర్లేదు !ఎవరూ రాలేదు కదానని ప్రయాణం మాత్రం ఆపకు . నువ్వొక్కడివే వెళ్ళు 


ఒక  వేళ నీతో ఎవరూ మాట్లాడకుంటే ,ఓ అభాగ్యుడా నీతో ఏ ఒక్కరు కూడా  మాట్లాడకుంటే,నీ చుట్టూ  వున్న అందరూ నిన్ను చూసి ముఖం తిప్పెసుకుంటూ వుంటే ,నిను చూసి భయపడి పోతూ వుంటే ,అప్పుడు ,నువ్వొక్కడివే నీ ప్రాణ శక్తినంతా వెచ్చించి నీ మనసులోని మాటను ఎలుగెత్తి  చెప్పేయ్ 


ఒకవేళ అందరూ వెనుదిరిగి పోతూ వుంటే ,పిరికి ముఖం వేస్తూ వుంటే  ఓ అభాగ్యుడా ఒక్కరూ నీ వైపు లేని ఆ నిర్మానుష్యమైన దారిలో నీవు వెళ్ళాల్సి వస్తే ,దారిలోని ముళ్ళు నీ పాదాలని రక్తమయం చేస్తున్నా ఆ రుధిర పాదాలతోనే పరుగు పెట్టు .కానీ ప్రయాణం మాత్రం ఆపకు . 

ఒక వేళ వెలుతురే కనిపించకుంటే ,ఓ అభాగ్యుడా ,కారు మేఘం అలుముకున్న చీకటి రాత్రి ,ఉరుములు మెరుపుల కుంబవ్రిష్టిలో నీ కోసం ఒక్క ఇంటి తలుపూ తెరుచుకోకున్నా ఓ అభాగ్యుడా నీ హృదయం లోని సాహసాన్ని దివిటీ చేసుకుని  జ్వలించు 






Tuesday 7 May 2013

కలక్టర్స్ వైఫ్



సివిల్ సర్వీస్ రిసల్ట్స్ వచ్చాయి కదా ,సివిల్ సర్వీస్ కి చదివే వాళ్ళందరూ కలక్టర్ అనే ఉద్యోగానికి ఆకర్షితమై ఈ వైపుకోస్తారు . నిజానికి ఒక సివిల్ సర్వెంట్ కలక్టర్ గా కేవలం నాలుగైదేళ్ళు మాత్రమె వుంటుంది/ఉంటాడు  .

కిరణ్ ,మాల్దా జిల్లాకు  కలక్టర్ అయ్యాడు . సీనియారిటీని కాదని కిరణ్ కి వాళ్ళ బాచ్ లో అందరికంటే ముందుగా కలక్టర్ పోస్ట్ ఇచ్చారు . ఆ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. కిరణ్ ఎక్కడ పని చేస్తే అక్కడ ప్రజలు ఆయన ''టాకూర్ మతో''[దేవుడి లాంటి వ్యక్తి ]అంటారు . కలక్టర్ ప్రమోషన్ వస్తుందనగానే కిరణ్ పనిచేసి వచ్చిన అన్ని జిల్లాల వాళ్ళు సర్ మీరు మా జిల్లాకి రావాలి అని ఫోన్లు చేసారు. ముఖ్య మంత్రి కి వినతులు కూడా ఇచ్చారు. ఫలితమే కిరణ్ ని సీనియారిటీని అతిక్రమించి ఇక్కడికి పంపించడం . ఈ వూరికి ప్రమోషన్ వచ్చిందని తెలియగానే అప్పుడు కిరణ్ పని చేస్తున్న ఆ వూరి  ప్రజలు మూడు వందల మంది దాకా వచ్చి ఈ సార్ లేక పోతే  మాకు పనులు కావు .[అక్కడ భూసేకరణ  జరుగుతూ ఉండింది .కిరణ్ ప్రజల పక్షాన గట్టిగా నిలబడ్డాడు . ఇతర అధికారులు నచ్చజెప్పాడు .రూల్స్ ని అతిక్రమించి అనేక వుపాయాలతో వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రయత్నించాడు . అందుకని  ప్రజలు రాముడుంటాడు ,రావణుడూ ఉంటాడు.   మనకోసం రాముడొచ్చాడు అని కవిత్వం చెప్పుకున్నారు ]ట్రాన్స్ఫర్ చేస్తే చేసారు కానీ ఈ చార్జ్ కూడా ఆయనకే ఇవ్వండి అని ఆఫీసుని నిర్భంధించి చాల సేపు ధర్నా చేసారు [కిరణ్ వచ్చేసిన రెండు నెలలకి చూసి చూసి ఇప్పుడు మళ్ళీ అక్కడ ప్రజలు దర్నాలకి దిగారట] . అప్పుడు ఆ ఊరి m l a నేను ఎన్నో ఏళ్ళ నుండి ఈ జిల్లాలో ఉంటున్నాను ,నాకు తెలిసీ ఈ జిల్లా చరిత్రలో ఒక అధికారిని ఉంచాలని ధర్నా చేయడం ఇదే ప్రధమం అని ఫోన్ చేసి అన్నారు  .

మాల్దా లో 58 % ముస్లిములు వుంటారు . అల్లర్లూ ,లాండ్ మాఫియా యెక్కువ. అది ఒకటైతే అంతకు ముందు ఇక్కడ వుండిన I A S అధికారి అరాచకాలు చెప్పనలవి కానివట . ఆవిడని ట్రాన్స్ఫర్ చేసినపుడు ప్రజలు ఔట్లు కాల్చి పండగ చేసుకున్నారట . ఒక సర్వెంట్ మెయిడ్ ని బాత్ రూం లో పెట్టి బంధించిందట . ఆవిడ పేరు బ్రౌస్ చేస్తే బోలెడు పితూరీలు ఓపన్ అవుతున్నాయని నా తమ్ముడు చెప్పాడు . ఆవిడని   ట్రాన్స్ఫర్ చేసి   '' బాలో చేలే కె పాటి యే దీచ్చి .బాలొ కాజ్ కొరున్ '' [మంచి అబ్బాయిని పంపుతున్నా   మంచి  గా  పని  చేయండి ]  అని  చెప్పిందట ముఖ్యమంత్రి మినిస్టర్ తో.  అయన ఆవిషయాన్ని మాకు చెప్పారు .

 నేను  కథలు రాస్తే అందరూ ఆయనే రాస్తున్నాడు అని కిరణ్ పేరు చెప్పుకున్నారు   నా వెనకాల .ఎందుకంటే నేను రాసేప్పుడు వాళ్ళు  చూడరు కాబట్టి . తమాషా ఏమిటంటే కిరణ్ పనుల్లో కొన్ని ఆలోచనలు నావి వుంటాయి . మొన్నో  పని జరిగింది బంగ్లాలో . అది నా ఆలోచన . అందరికీ ఆ విషయం తెలుసు . కానీ ,ఆ పుణ్యమంతా సార్  మీకు వస్తుందీ అన్నారు .  కిరణ్ అది విని నొచ్చుకున్నాడు .నాన కంటే ముందు పాపాయి ,అదేంటి అది అమ్మ ఆలోచన కదా అని ఖండించి వేసింది . ఇంట్లో వుండే నా పుస్తకాలు చూసి సార్  బాగా చదువుతారు లాగుంది అంటారు . ఆయన భార్య చదవచ్చు అనే ఊహ వాళ్లకి రాదు . వచ్చినా సార్ కి కీర్తినీయడం వాళ్లకి బాగుంటుంది . అంతకు ముందు ఒక కొండ పైన వుండే వాళ్ళం మేము .వట్టి రాళ్ళు నేల నిండా . చాలా కష్ట పడి ఆ కొండను పది మంది విస్తుపడి చూసేంత ఉద్యానవనం చేశా నేను .వచ్చి చూసే ప్రతి ఒక్కరూ సార్ కి గార్డెనింగ్ అంటే ప్రాణం లాగుంది అనే వారు .ఎందుకంటె ఈ పనులు  వాళ్ళు చూడరు కాబట్టి . ఆడవాళ్ళు తెలివిగానో ,చురుకుగానో వుండటం ఈ సాధారణ ప్రపంచం ఊహించలేదు కాబట్టి .

పెద్ద వ్యక్తుల పక్కనుంటే మన చిన్ని ప్రతిభలు కూడా వాళ్ళలో లయమై మరుగున పడి  పోతాయి . కిరణ్ మర్రి వృక్షం . నేను అతని నీడలో వున్న స్త్రీని .నాకేం  ప్రతిభలు వున్నా వ్యర్థమె ఇక .

అయినా కానీ కిరణ్ ని ఎవరైనా మెచ్చుకున్నారంటే నాకు చాలా ఇష్టం . మొన్న మాల్దా కి వచ్చిన ఎలక్షన్ కమిషనర్ ''ఏంటి ఎక్కడికెళ్ళిన అందరూ మీ పేరే చెబుతున్నారు ఏం చేస్తారెంటి మీరు '' అని అడిగాట్ట . అటువంటివి వింటే నాకు గర్వం కలుగుతుంది . కిరణ్ పై చాలా ప్రేమ పెరుగుతుంది.  భక్తి కూడా . ఎవరెవరో ఆడవాళ్ళు రాస్తుంటే వాళ్ళందర్నీ  వాళ్ళ భర్తలు రాస్తున్నారు అనడం లేదు  కదా ? రాయగలిగే శక్తి ఉన్నవాడని కిరణ్ ని అందరూ భావించడం నాకు గర్వాన్నిస్తుంది  . కిరణ్ బాగా పని చేస్తున్నాడూ అంటే నేనతనికి మంచిగా సహకరిస్తున్నాను అని నాకు నేను చెప్పుకుంటాను . నాకు పొలమూ పుట్ర ,నగ నట్రా కోరికలు లేక పోబట్టి కదా అతనంత మంచిగా, నిజాయితీగా ప్రజల కోసం పనిచేయగలుగుతున్నాడు అనుకుంటాను . అతని సమయాన్ని డిమాండ్ చేసి సినిమాలకీ షికార్లకీ రమ్మనకపోబట్టే కదా ఎక్కువ సమయం పనిచేయగలుగుతున్నాడు అనుకుంటాను .

అవును ప్రతి మగాడి విజయం వెనుకా స్త్రీ ఉంటుందనే మాట అక్షర సత్యం . కనుక కిరణ్ విజయాలు ,ఆనందాలు నావి కూడా .  నిజానికి భర్త ఉద్యోగాన్ని ప్రస్తావించడం నాకు అయిష్టమైన విషయం . ఎవరైనా నీ భర్త ఏం చేస్తాడు అని ప్రశ్నిస్తే  నేను వాళ్ళని అనాగరికులుగా జమకట్టేస్తాను . .కానీ ఇది వేరే .ప్రజల పక్షాన నిలబడే ఒక మంచి వ్యక్తి కి నేను భార్యని అని చెప్పుకోవడం నాకు గొప్పగా వుంటుంది . అందుకనే కలక్టర్ గా కిరణ్ అనుభవాలని అతని సహచరిగా అక్షరబద్ధం చేయాలనుకున్నాను .

''కలక్టర్స్ వైఫ్''  అనే లేబుల్ కింద ఇప్పటి నుండీ అవన్నీ రాస్తాను


Saturday 4 May 2013

మరణానంతరము



ఒక రోజు ఒక ప్రముఖ వ్యక్తి చాలా ఆసక్తిగా ''సామాన్యా  ,నా గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటుందీ ''అని అడిగారు. ఆవాళ బుద్ధి పూర్వకం గా నేను సమాధానాన్ని దాటవేసాను .

నేను కథలు రాయటం మొదలు పెట్టాక నాకు సాహితీపరులు కొంతమంది పరిచయమయ్యారు . వారిలో కొంత మంది ఒక రచయిత గురించి అదే పనిగా చాడీలు చెప్పేవారు . అట్లా వింటే ఏమవ్వాలి ?ఏమో నాకయితే ఆ సదరు వ్యక్తి పట్ల హృదయం సరళమై ,జాలి కలిగి స్నేహం పెంచుకున్నాను .ఇదేమ్ స్వభావం ?

నా లాగే నా బిడ్డ బిడియస్తురాలు . మనుషులు నచ్చితే ఎంత వాచాలత్వం రాగలదో ,హృదయానికి దగ్గరగా రాని వారిపట్ల దాని గొంతు రాయవుతుంది . దాని క్లాస్ మేట్స్ తల్లులు కూడా ఈ అమ్మాయికి గర్వం అనుకునే వారట .ఏడేళ్ళ  చిన్న బిడ్డకు గర్వమనే పదార్తాన్ని ఆపాదించిన లోకం లేక్కేమిటికసలూ ?

ఈ సమస్త ఆలొచనలు నాకు ''మరణాంతరము''చదివిన తరువాత కలిగాయి . చెప్పకేం ... నేను బోలెడు చదివాను .చిన్నప్పటి  నుండీ ఇప్పటి వరకూ ,,,కానీ ఈ నవల ఇచ్చా పూర్వకం గా మానవుని బహుముఖాలని స్పృశించి నంతగా మరే నవలా స్పృశించడం  నా చిన్ని ప్రపంచం లో నేను చదివి ఉండలేదు  .

రచయిత శివరామకారంత్ .

ఈ రచయితకు బొంబాయికేలుతున్న  రైలు ప్రయాణం లో ఒక వ్యక్తి పరిచయమవుతాడు ఆరేడేళ్ళ పరిచయం లో కొన్ని మార్లు కలుసుకోవడము ... కొన్ని ఉత్తరాలు .... !

కొందరు మనషులు అతి చిన్ని పరిచయంలోనే చాలా ప్రేమించెంత గా మనకెందుకు నచ్చుతారు?బహుశా  వారిలోని నిష్కల్మషత్వాన్ని మన హృదయం కనిపెట్టడం కావచ్చును  ,లేదా మన హృ దయమూ వారి హృదయమూ ఒకే పదార్ధం తో తయారయిందనే స్పృహ మనకు కలగడమూ కావచ్చును  !

యశ్వంత రావ్ కి అతి చిన్ని పరిచయంలోనే శివరామకారంత్ మీద అలాటి అభిప్రాయం కలుగుతుంది .

అంత్య కాలంలో యశ్వంత రావు గారు చూడాలనుకున్న ఒకే వ్యక్తి కారంత్ గారు .వీరు వెళ్ళే సరికే ఆయన చనిపోతారు . శవ దహనం ఈయనే చేయవలసి వస్తుంది . దానితో పాటు వీరి పేరిట యశ్వంత్ రావు గారు పదిహేను వేల రూపాయల డ్రాఫ్ పంపి తను నెల నెలా పంపవలసిన వారికి పంపాలని ,మిగిలిన డబ్బుని ''నేనే మీరనుకుని ''ఖర్చు చేయమని చెబుతారు .

అసలు ఈ యశ్వంత్ రావు గారు ఎవరూ ... రచయిత అన్వేషణ  మొదలు పెడతారు . అతను వదిలి వెళ్ళిన డైరీ లో ,పెయింటింగ్ లలో ,రహస్యాన్ని  దాచుకున్న మారు పేర్లు లో ... ఆయన డబ్బు పంపమన్న వారి చిరునామాలు పట్టుకుని వారి ఇళ్ళకు వెళ్తాడు . ఆయన విడిచి పెట్టి పారిపోవడానికి కారణమైన భార్యా,కొడుకూ ,అతను ప్రేమించిన స్త్రీ ,ఆవిడకి పుట్టిన పిల్లలు  అక్కడ రక రకాల అనుభవాలు ,రక రకాల పరిచయాలు .

రచయిత మిత్రుడి కోసం బాధ్యతగా సాగించిన అన్వేషణలో ఒకే మనిషి గురించి ఒక్కోరు ఒక్కో అభిప్రాయాన్ని చెబుతారు .

అవునూ...   అదెలా సాధ్యం ?ఒక వ్యక్తి మంచి వాడయితే మంచి వాడవ్వాలి లేకుంటే చెడ్డ వాడన్నా  అవ్వాలి కదా !ఒకే మనిషి ఒకరికి మంచి ఒకరికి చెడ్డా ఎట్లాగా ?

కానీ నిజమంతే మనిషి బహుముఖీనుడు . అది ఒకటి  . రెండోది  ఏమిటంటే మీ వలన సహాయం పొందిన వారికి మీరు మంచి వారు .అవును ,మీరు చెడ్డ వారయినప్పటికీ , మీరు మంచి వారు కాగలరు.  అలాగే ఏ కారణానో మీరు నచ్చని వారికి మీరు మంచి వారయ్యీ చెడ్డ వారు కాగలరు . అట్లాగే ఒక మనిషి స్వభావపు అంచనాలలో మన స్వభావ స్తోమత కూడా కలిసి వుంటుంది . మన వ్యక్తిత్వ ఔన్నత్యమొ ,అల్పత్వమో ఎదుటి వారిపై అభిప్రాయాలను ఏర్పరచుకునేలా చేస్తుంది . ఒకరు ఒకానొక కాలం లో మనకు బాగా నచ్చి, తరువాత వెగటు కలగడానికి కారణం మన మనస్తత్వం లోని చాపల్యత కావచ్చును . ఈ విషయాలన్నింటినీ ఒక్కో పాత్రని ఆలంబనం చేసుకుని చెపుతారు కారంత్ .

ఇంతకీ ఈ నవల ఏం చెబుతుందీ ?యేమని ముగింపుని ఇచ్చింది ?ఏమీ లేదు ! ఒక జీవితాన్ని చిత్రించింది ,అంతే !అంతే అయితే మరి పాటకునికి లాభమేమిటి ?దీనికి సమాధానం ఇది -ప్రతి సృజనా వాచ్యంగా పాటకుడినో ,మానవుడినో ఇది చేయమని శాసించదు. అన్ని సార్లు ముగింపుని కృతకంగా చెప్పి దిశానిర్దేశం చేయడం వీలు కూడా కాదు . కానీ మంచి రచన చదివిన తరువాత మనం  మానసికంగా సంపన్నులమవుతాం . ఇలా చేయడం తప్పు,లేదా ఇది సరైనదే అనే అవగాహన ఏర్పరచుకుంటాం.వాచ్య సూచనలు లేకుండానే మంచి వైపుకి మొగ్గుతాం . ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప  రచన మనుషులను నాగరీకులని చేస్తుంది .

చిక్కటి భాష ,లోతైన తాత్వికత కలిసిన ఈ నవల మనల్ని అంతర్ముఖీనులను చేస్తుంది . మానవ స్వభావాన్ని అర్థం చేసుకునే మానసిక ఎదుగుదలని  ఇస్తుంది .

పేజీల కొద్దీ వాక్యాలు నా హృదయానికి హత్తుకుని పోయాయి .ఈ రచయిత నా హృదయానికి దగ్గరి వాడుగా తోచాడు . ఆలొచనల సామీప్యత వలన ఆత్మీయుడయ్యాడు . నేర్చుకోవలసినది చెప్పి గురువయ్యాడు .

'' మన పూర్వ ఋషులు కొందరు జగత్తు,సృష్టి విషయంలో -ఇది ఇలా ,ఇదే సత్యం ;ఇదే చివరి మాట -అనే రీతిగా చెప్పారు కదా మీరు వేదాలనండీ ,వుపనిషత్తులనండీ ,మరేమన్నా అనండి ,తపస్సుతో తెలుసుకున్నదనండి ,భగవంతుడే ఒక చెవిలో ఊదినాడనండి ,నాకొక సంశయం . ఈ విశ్వం ,సృష్టి వీని విషయంలో కొద్దిగా నేనూ  చదివి తెలుసుకున్నాను . జీవ కోటి ఈ యాత్ర ఎప్పుడో ప్రారంభమయింది .యెక్కడికొ సాగుతున్నది ;ప్రయాణం ప్రారంభమయిన ఎంతో కాలం తరువాత ,దారిలోని రైల్వే స్టేషనులో బండి ఎక్కే ప్రయాణికుని లాగా ,మనుష్యుడనే ప్రాణి లోపల ప్రవేశించాడు ;ప్రవేశించిన వాడు ప్రవేశించినట్టు దిగిపోనూ పొయాడు . జీవిత ప్రయాణమేమో ఇంకా ముందుకు సాగింది .దాని లక్ష్యం ఇంతవరకూ తెలియ లేదు 'ముందు దారి లెక్క పెట్టలేనంత దూరం ,అలాటి సమయం లో ఎవరైనా సరే ''నేను దీని రహస్యం తెలుసుకున్నాను .'' ''ఇదే సత్యం ''అని ఘంటాపథం గా చాటితే నగుబాటు కాదా?''

పీఎస్ :ఈ నవలను నాకు పంపినందుకు ,మంజుల గారు మీకు నేను చాలా రుణపడ్డాను . మీ సహృదయతకు ప్రేమ పూర్వక కృతజ్ఞతలు .




Thursday 2 May 2013

అపర్ణాసేన్‌ కొత్త సినిమా ”గొయినార్‌ బాక్షో”



అపర్ణాసేన్‌ ”గొయినార్‌ బాక్షో”

- సామాన్య
ఈ ఏప్రిల్ పన్నెండున అపర్ణ సేన్‌ కొత్త (బెంగాలీ) సినిమా ”గొయినార్‌ బాక్షో” విడుదలయింది. గొయినార్‌ బాక్షో అంటే నగల పెట్టె  అని అర్థం. ఈ సినిమాకి మూలం అదే పేరుతో వున్న శీర్షేందు ముఖోపాద్యాయ్‌ నవలిక . మూడు తరాలకి చెందిన ముగ్గురు ఆడవాళ్లు, ఒక నగల పెట్టె  వాళ్ళ జీవితాలతో పెనవేసుకున్న తీరు, వారి వివాహాలు, మోహాలు, దుఃఖ్ఖాలు, విజయాలు అన్నింటినీ స్పృశిస్తూ స్త్రీల దృష్టికోణం నుండి ,స్త్రీవాద అవగాహనతో తీసిన సినిమా గోయినార్‌ బాక్షొ.
మొదటి తరం స్త్రీ రాస్‌ మణి,చిన్న వయసులోనే విధవగా మారిన జమీందారు కూతురు. ఈమె కాలంలో దేశ విభజన జరుగుతుంది. వున్న స్తిరాస్తులను వదలుకుని వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌కి వలస వస్తుంది. కుటుంబ పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతగా మారుతుంది. అయినా యెన్ని విపత్తులు వచ్చి పడినా గయ్యాళి నోటి రాస్‌ మణి తన నగలపై ఈగని కూడా వాలనీయదు. 

ఆ ఇంటికి కొత్త కోడలిగా అడుగు పెడుతుంది సోమలత. ఆమె వచ్చిన కొన్ని రోజులకే ఆమె భర్త పిషి మా (మేనత్త) రాస్‌ మణి మరణిస్తుంది. అనుకోకుండా రాస్‌ మణి గదిలోకి వెళ్ళిన సోమలతకు రాస్‌ మణి దెయ్యం కనిపించి పెట్టె తాళం చెవులిచ్చి నగల పెట్టెని తీసికెళ్ళి దాచమంటుంది. అది మొదలు రాస్‌ మణి దెయ్యం సోమలత కదలికలను నియంత్రిస్తూ నగలని జాగ్రత్తగా కాపాడుకుంటూ వుంటుంది. అయినా భర్త ఆత్మ హత్యకి ప్రయత్నిస్తున్న సందర్భంలో సోమలత రాస్‌ మణి నగలు కొన్నింటిని కుదువ పెట్టి బట్టల దుకాణం తెరుస్తుంది. అది తెలిసి రాస్‌ మణి సోమలతతో ఘర్షణ పడ్డా, శారీ స్టోర్‌కి ”రాస్‌ మణి శారీ స్టోర్‌” అని పేరు పెట్టారని తెలిసి ,విధవ …. విధవ అని జీవితమంతా పిలిపించుకున్న తన పేరుకి వచ్చిన గౌరవాన్ని చూసి ఉప్పొంగిపోతుంది.
మూడవ తరం స్త్రీ చైతాలి. స్కూటర్‌ నడపగల, ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకోగల స్వేచ్ఛా మానసం వున్న ఆధునిక యువతి. చైతాలికి చిన్నప్పటి నుండీ రాస్‌ మణి దయ్యం కనిపిస్తూ వుంటుంది. నగల మీద ఏ మాత్రం ఆసక్తి లేని చైతాలీని, తన నగలని అప్పుడు నడుస్తున్న బంగ్లాదేశ్‌ స్వాతంత్ర పోరాటం” ముక్తి వాహిని ”కోసం వినియోగించమని రాస్‌ మణి ప్రోత్సహి స్తుంది. చైతాలి రాస్‌ మణి నగల ఆధునిక ప్రయోజనం గుర్తించడంతో సినిమా ముగుస్తుంది.
ఆపర్ణ సినిమా కోసమని నవలికలో కొన్ని మార్పులు చేసారట. దాన్ని గురించి ప్రశ్నించినపుడు రచయిత శీర్షేందు ”ఆ నవలని నేను 90లలో రాసాను. అప్పట్లో ఏం రాసానో నాకు జ్ఞాపకం కూడా లేదు. అపర్ణ ఏం మార్పులు చేసి వున్నా నాకు సంతోషమే” అన్నారు. బెంగాలీ మేధావులు, కళాకారులు ఒకరినొకరు బాగా గౌరవించు కుంటారు. ఆ కారణం చేత కూడానేమో వాళ్ళెప్పుడూ అవార్డుల వరుసలో ముందుం టారు. ఒకరి కాళ్లు ఒకరు పట్టి క్రిందికి లాక్కునే తెలుగు వారి సంస్కృతికి ఇది చాలా భిన్నం. ఈ నవల నేను ఇంకా చదవలేదు కనుక ఆ మార్పులేమిటో చెప్పలేను కానీ, ఆ మార్పులు తప్పకుండా స్త్రీల సమస్యలను ప్రశ్నించేవిగా ఉంటాయని నాకు తెలుసు. ఆ ప్రశ్నలని ఆకాంక్షలని ఇక్కడ డికోడ్‌ చేస్తాను.
మాట్లాడలేని లోహాభరణాలకి మాట్లాడే రాస్‌ మణి ప్రతినిధి. మూడు తరాలలో బంగారం ఏయే రూపాన్ని పొందిందో రాస్‌ మణి పాత్ర చెప్తుంది. దెయ్యమైన రాస్‌ మణి శరీరధర్మ రీత్యా మరణించిన వయసులోనే ఆగిపోయినా, మానసికంగా ఒక తరం తరువాత మరో తరానికి మారుతూ వస్తూ వుంటుంది. తన నగలని ఆస్తిగా గుర్తించినా వాటిని ఆచలంగానే వుంచేసిన మొదటి తరం రాస్‌ మణి, సోమలత వాటికి ద్రవ్య రూపాన్నిచ్చి తన పేరుకో గుర్తింపుని తెచ్చి పెట్టినపుడు ఆ మార్పుని స్వీకరించి ఆధునికం అవుతుంది. చైతాలి సమయం వచ్చేసరికి మనవరాలికంటే ముందుకెళ్ళి ఆలోచించి తన నగలని ముక్తి వాహిని కి వినియోగించమంటుంది. అట్లా ఈ పాత్ర కాలంతోపాటు మారుతూ వచ్చి మారిన ఆధునిక భారత స్త్రీకి ప్రతినిధిగా నిలుస్తుంది. 

అపర్ణ తన ప్రతి సినిమాలోనూ స్త్రీ పురుష సంబంధాల ప్రశ్నలు వేస్తూనే వుంటుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు. సోమలత భర్త సంప్రదాయ భర్తలకి ప్రతినిధి. మామూలు భర్తలకి వుండే సుగుణాలు దుర్గుణాలు వున్నావాడు. అతనో సారి వ్యాపార నిమిత్తమై దూర ప్రాంతాలకి వెళ్తాడు. ఒంటరిగా శారీ స్టోర్‌ కి వెళ్లి వస్తున్న సోమలతను పరాయి మగవాడురోజూ వెంబడిస్తూ ఉంటాడు. అది గమనించి రాస్‌ మణి అతనితో సంబంధం పెట్టుకోమని సోమలతని ప్రోత్సహిస్తుంది. ఆ సన్నివేశం చూసి మనం ఆశ్చర్యపడతాం. మన ఆశ్చర్యం పై దెబ్బ కొడుతూ స్క్రీన్‌ ప్లే రాసిన అపర్ణ ”ఏం మగవాళ్ళకేనా అన్ని ఆనందాలు?” అని ప్రశ్నిస్తుంది. అన్నట్టుగానే సోమలత ఒకసారి ప్రియుడి సముఖానికి వస్తుంది. అప్పుడే భర్త తిరిగి వస్తాడు. ఆ ఏడాది సోమలతకి చైతాలిపుడుతుంది. పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తల్లి మాత్రమే చెప్పగలదనె మాట గుర్తొచ్చి మనం ఆశ్చర్యపడతాం.
రచయితగా చలం కానీ దర్శకురా లుగా అపర్ణ కానీ వివాహ విచ్ఛిన్నతని, విశృంఖలతని ప్రతిపాదించరు. ఆలోచించ డానికి  స్వంతంగా మెదడూ, శరీరానికి కోరికలూ వున్న స్త్రీకి సమాజం, వ్యక్తీకరణని నిషేధించి ఎలా బంధించి వేసిందో చెప్తారు. విముక్తిని కలగంటారు. పురుషులు వివాహే తర సంబంధాలలోనో ,ప్రేమ సంబంధాల లోనో వున్నపుడు ఆ సంబంధాలలో స్త్రీలు కూడా వుంటారు. కానీ మన కపట ప్రపంచం ప్రేమనో ,వ్యామోహాన్నో పురుషుడు ప్రకటించినట్లుగా స్త్రీని ప్రకటించనీయదు. అటువంటి సంబంధాలలో వున్న స్త్రీ కూడా సమాజానికి భయపడి పైకి పాతివ్రత్యాన్ని వుపన్యసిస్తుంది. ”ఏం ఆనందాలన్నీ మగవాళ్ళకేనా” అన్న ప్రశ్న అట్లాంటి ఈ కపట ప్రపంచాన్ని షాక్‌కి గురి చేయడానికి వుద్దేసించినదే తప్ప విశృంకలతని వుద్దేసించినది కాదు . అపర్ణ తన ప్రతి సినిమా లోనూ నిలవనీటి మురికి గుంటలాంటి ఈ సమాజాన్ని ప్రశ్నల రాళ్ళు వేసి చెదరగొట్టి చలనం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ వుంటుంది.
అణచివేతలకి సంబంధించిన ఇంకో ప్రశ్న రాస్‌ మణి ప్రణయ ప్రయత్నం. నిండు యవ్వనంలో వున్న విధవ రాస్‌ మణి తన ఇంట్లో బొగ్గులు కొట్టే పని వాడితో ప్రణయానికి ప్రయత్నిస్తుంది. చీకటి పడ్డాక గదికి రమ్మని పిలుస్తుంది. పిలుపునందుకుని వచ్చిన ఆ కుర్ర వాడు దురదృష్టవశాత్తు పట్టుపడి తన్నులు తింటాడు. అట్లా రాస్‌ మణి కోరికని భుగ్గిపాలు చేస్తాడు. ఈ సన్నివేశం నాకు ప్రఖ్యాత ఆంగ్ల చిత్రం ”టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌” ని జ్ఞాపకం తెచ్చింది. రెండు చిత్రాలలోనూ స్త్రీలు అగ్రవర్ణులు. ఇద్దరూ కూడా అణచివేతలో తమకన్నా ఒక మెట్టు క్రింద వున్న పురుషులను ప్రలోభ పెట్టాలని చూస్తారు. ఈ ప్రయత్నంలో మాకింగ్‌ బర్డ్‌లో శ్వేత స్త్రీ ”మయెల్ల” అమాయుకుడైన నల్లజాతి యువకుడి మరణానికి కారణమవుతుంది. కొడవటిగంటి కుటుంబ రావు ఒక కథలో తన స్వార్థ ప్రయోజనం కోసం నాయిక (బహుశా) పార్వతి ఒక దళితుడిని పెళ్ళాడి అతని జీవితాన్ని కల్లోలం చేసి దుఃఖితుడ్ని చేస్తుంది. స్త్రీలయినప్పటికీ అగ్రవర్ణ స్త్రీలు అణచి వెయబడ్డ కులాల పురుషల్ని ఏ దృష్టి కోణంతో చూస్తారో, అణచివేతలో వారు కూడా ఎలా పాలు పంచుకుంటారో చెప్పిన అపర్ణ, చైతాలి పరంగా ఇప్పుడు రావాల్సిన మార్పును కూడా చెప్తుంది.
ముక్తి వాహిని ఉద్యమంలో చురుకుగా ఉంటున్న చైతాలి స్నేహితుడ్ని చూసిన రాస్‌ మణి ఆ యువకుడిని పెళ్లి చేసుకోమని చైతాలితో అంటుంది. సినిమాలో ఆ యువకుడి పాత్రను ,అప్పుడు రాస్‌ మణి మోహించిన యువకుడి పాత్రను వేసిన నల్లటి యువ నటుడు ఒక్కరే కావడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. అణచివేయబడ్డ కులాల వారు చదువుకుంటున్నారు, ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు అని చెప్పడంతో సరి పెట్టుకోదు అపర్ణ, ఇప్పుడు, అత్యాధునికంగా మారిన రాస్‌ మణి చేత అతడిని పెళ్ళెందుకు చేసుకోకూడదు అన్న ప్రశ్న కూడా వేయిస్తుంది.
నాకు వ్యక్తిగతంగా నా కులం, నా భాష, నా భారతదేశం అనే భావాలు వుండవు. అందుకని అపర్ణా సేస్‌ భారత దేశం గర్వించ దగ్గ దర్శకురాలు[నిజానికి ఆమె ఒక దేశం గా భారత దేశం గర్వించ దగ్గ దర్శకురాలు ] అని స్టేట్‌ మెంట్‌ ఇవ్వను. కానీ, ఒకటి మాత్రం చెప్పగలను మనిషిగా, అందునా స్త్రీ ప్రకృతిగా నేను అపర్ణని చూసుకుని గర్వ పడతాను. ఆనంద పడతాను. ప్రేమిస్తాను.


రాష్మోని దెయ్యంగా మౌసమి చటర్జీ 
Story: Shirshendu Mukhopadhyay
Starring : Moushumi Chatterjee, Konkona Sen Sharma, Srabanti, Saswata Chatterjee & Others.
Producer : Shree Venkatesh Films Pvt. Ltd.
Presenter: Mahendra Soni & Shrikant Mohta.
Director: Aparna Sen.
Screenplay & Dialogue: Aparna Sen
Music: Debojyoti Mishro
Cinematographer: Soumik Halder
Editor: Rabiranjan Moitra
Art Director: Tanmoy Chakraborty